: ఒక్క విమర్శకు ఎన్ని పంచ్ లు వేశారో!


న్యూజిలాండ్ క్రికెట్ అభిమానులు ఆసీస్ మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ పై కారాలుమిరియాలు నూరుతున్నారు. అందుకో కారణం ఉంది. తాజాగా, హేడెన్ మీడియాతో మాట్లాడుతూ, న్యూజిలాండ్ జట్టుకు ఆస్ట్రేలియాలోని భారీ మైదానాల్లో కష్టాలు తప్పవని అన్నాడు. ఆదివారం జరిగే వరల్డ్ కప్ ఫైనల్లో ఆసీస్, కివీస్ తలపడుతున్న సంగతి తెలిసిందే. మెల్బోర్న్ క్రికెట్ స్టేడియం (ఎంసీజీ) ఈ టైటిల్ సమరానికి వేదిక. అతి భారీ స్టేడియంగా దీనికి పేరుంది. "నిజాయతీగా చెప్పాలంటే, ఆక్లాండ్ లోని ఈడెన్ పార్క్ ఓ మైదానం కానేకాదు. దాని పరిమాణం హాస్యాస్పదం. మరీ అంత చిన్న గ్రౌండా?" అని విమర్శించాడు. వరల్డ్ కప్ లో సెమీస్ వరకు సొంత మైదానాల్లో ఆడి గెలిచారని, అవి చిన్న మైదానాలని ఎద్దేవా చేశాడు. ఎంసీజీలో మాత్రం వారి పప్పులు ఉడకవని అన్నాడు. భారీ షాట్లు కొట్టే క్రమంలో క్యాచ్ లు ఇస్తారని అభిప్రాయపడ్డాడు. ఈ వ్యాఖ్యలు కివీస్ ఫ్యాన్స్ కు కోపం తెప్పించాయి. అయితే, వారు తమ ఆగ్రహాన్ని సెటైర్ల రూపంలో వ్యక్తం చేశారు. అవేంటో చూద్దాం... ఎంసీజీ చాలా పెద్దది... అక్కడ స్ట్రీకర్ల (నగ్నంగా మైదానంలోకి పరిగెత్తుతూ నిరసన వ్యక్తం చేసేవాళ్లు)కూ డ్రింక్స్ బ్రేక్ ఇస్తారు. ఎంసీజీ చాలా పెద్దది... ఆసీస్ మాజీ క్రికెటర్ డేవిడ్ బూన్ ఈ మైదానంలో అటునుంచి ఇటు నడిచి వచ్చేలోపు 52 బీర్లు తాగుతాడు. ఎంసీజీ చాలా పెద్దది... కెప్టెన్లు ఫీల్డింగ్ మోహరించే క్రమంలో ఆయా పొజిషన్లు వెతుక్కోవాలంటే జీపీఎస్ వ్యవస్థ సాయం తప్పనిసరి. ఎంసీజీ చాలా పెద్దది... అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం ఇందులో చక్కగా ఇమిడిపోతుంది. ఎంసీజీ చాలా పెద్దది... కాలగర్భంలోని కలిసిపోయిన అట్లాంటిస్ సిటీ ఈ మైదానం అవుట్ ఫీల్డ్ లో ఫైన్ లెగ్, థర్డ్ మ్యాన్ మధ్య ఎక్కడో ఉండి ఉంటుందని చాలామంది అనుకుంటున్నారు. ఎంసీజీ చాలా పెద్దది... ఆ కనిపించేవి ఫ్లడ్ లైట్లు కాదు, పొరుగు గ్రహ వ్యవస్థ నుంచి తీసుకొచ్చిన భారీ సూర్యుళ్లు. ఈ విధంగా తమకు తోచిన రీతిలో వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. దీనిపై హేడెన్ స్పందన ఇంకా తెలియరాలేదు.

  • Loading...

More Telugu News