: ఆరోగ్య బీమాపై మోదీ వెనకడుగు... ఎన్నికల హామీ అమలు ఎప్పటికో!
దేశంలోని ప్రజలందరికీ ఆరోగ్య బీమాను దగ్గర చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన మోదీ, అధికారంలోకి వచ్చాక 'నేషనల్ హెల్త్ అస్స్యూరెన్స్ మిషన్' ప్రకటించారు. వచ్చే ఐదేళ్ల కాలానికి ప్రజలకు బీమా సౌకర్యం కోసం వెచ్చించాల్సిన మొత్తం సుమారు రూ. 1.16 లక్షల కోట్ల వరకూ ఉంటుందని అధికారులు లెక్కలు వేయగా, దాన్ని పక్కనబెట్టి ఖర్చులను తగ్గించేలా తిరిగి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మోదీ కోరినట్టు తెలుస్తోంది. వాస్తవానికి 120 కోట్ల మంది భారతీయులకు నాలుగేళ్ల పాటు బీమా కోసం 25.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 1.50 లక్షల కోట్లు) కేటాయించాల్సి ఉంటుందని అక్టోబర్ లో వేసిన అంచనాలను సవరించారు. వచ్చే ఐదేళ్లకు గాను రూ. 1.16 లక్షల కోట్లకు అధికారులు కొత్త ప్రతిపాదనలు చేశారు. ఈ మొత్తం కూడా చాలా ఎక్కువని భావించిన మీదటే ఈ కార్యక్రమానికి ఇంకా అనుమతి రాలేదని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. మరోసారి ఈ పాలసీని పరిశీలించి మార్పులు చేయనున్నట్టు వివరించారు.