: ఆయన ఫోన్ చేసింది 44 సార్లు కాదు... మూడు సార్లే!: ఐఏఎస్ రవి ఉదంతంలో తెలుగు మహిళా ఐఏఎస్
కర్ణాటక ఐఏఎస్ అధికారి డీకే రవికుమార్ అనుమానాస్పద ఆత్మహత్యోదంతం రోజుకో మలుపు తిరుగుతోంది. తన బ్యాచ్ మెట్ అయిన మహిళా ఐఏఎస్ అధికారితో ప్రేమాయణం నేపథ్యంలోనే రవి ఆత్మహత్య చేసుకుని ఉంటారని కర్ణాటక ప్రభుత్వంతో పాటు సీఐడీ అధికారులు మీడియాకు లీకులిచ్చారు. అంతేకాక ఇదే విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా వెల్లడించేందుకు సిద్ధరామయ్య సర్కారు సన్నాహాలు చేస్తోంది. దీంతో సదరు వివాదంలో చిక్కుకున్న తెలుగు మహిళా ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరి వాస్తవాలను వెల్లడించేందుకు బయటకు రాక తప్పలేదు. ఆత్మహత్య చేసుకున్న రోజున రవి తనకు కేవలం మూడు సార్లు మాత్రమే ఫోన్ చేశారని చెబుతున్న సింధూరి, ప్రభుత్వం చెబుతున్నట్లు 44 సార్లు రవి తనకు ఫోన్ చేయలేదని వెల్లడించారు. ఈ మేరకు ఆమె నిన్న తన భర్త సుదీర్ రెడ్డి ద్వారా కోర్టుకు తెలిపారు. అంతేకాక సోమవారం అసెంబ్లీలో ప్రభుత్వం చేయనున్న ప్రకటనను వాయిదా వేయించారు. దీంతో ఈ కేసులో మరిన్ని కీలక మలుపులు తప్పేలా లేవు.