: హమ్మయ్య... ఆత్మహత్య చేసుకోలేదు... ప్రొఫెసర్ స్పందన కథ సుఖాంతం
రెండురోజుల క్రితం అదృశ్యమైన హైదరాబాదులోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ అగ్రికల్చరల్ యూనివర్శిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ స్పందన కథ సుఖాంతమైంది. ఆత్మహత్య చేసుకుంటున్నట్టు నోట్ రాసి బంధువులను ఆందోళనకు గురిచేసిన ఆమె తనంతట తానే స్వయంగా ఇల్లు చేరింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం ఉదయం విధులకు వెళ్లిన స్పందన తన తల్లికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకోబోతున్నానని చెప్పి, అదే విషయాన్ని డైరీలో రాసి అదృశ్యమైన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టినా ఫోన్ స్విచ్ఛాఫ్ చేసి ఉండడంతో ఆమె ఆచూకీ కనిపెట్టడం క్లిష్టతరం అయింది. భర్త ప్రవర్తన పట్ల విసుగు చెందిన ఆమె మనస్తాపంతో సూసైడ్ నోట్ రాసి అదృశ్యమైనట్టు సమాచారం. చివరికి ఆమె క్షేమంగా ఇంటికి రావటంతో కుటుంబ సభ్యులు ఆనందంలో మునిగిపోయారు.