: రక్తమోడిన మార్కెట్!... 654 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్
వరుసగా ఏడవ సెషన్ లోనూ స్టాక్ మార్కెట్ నష్టపోయింది. అయితే మిగిలిన ఆరు రోజుల నష్టం కన్నా ఏడవ రోజు నష్టమే ఎక్కువ. మార్చి నెల ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ముగింపు నాడు అమ్మకాలకే ఇన్వెస్టర్లు ప్రాధాన్యం ఇవ్వగా, సెషన్ ఆరంభం నుంచి ఏ దశలోనూ సూచీలు కోలుకోలేదు. సౌదీ అరేబియా తన సైన్యంతో యమన్ పై దాడి చేసినట్టు వచ్చిన వార్తలు అంతర్జాతీయ స్థాయిలో కొత్త చమురు కష్టాలను తెచ్చి పెట్టవచ్చన్న అనుమానాలు పెట్టుబడిదారుల సెంటిమెంట్ ను దెబ్బతీశాయి. మార్కెట్ పతనానికి అడ్డుకట్ట వేసే సంకేతాలే కరవయ్యాయి. ముఖ్యంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారీగా ఈక్విటీలను విక్రయించారు. గురువారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్ 654.25 పాయింట్లు పడిపోయి 2.33 శాతం నష్టంతో 27,457.58 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి నిఫ్టీ 188.65 పాయింట్లు పడిపోయి 2.21 శాతం నష్టంతో 8,342.15 పాయింట్ల వద్దా కొనసాగాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ 0.84 శాతం, స్మాల్ క్యాప్ ఒక శాతం నష్టపోయాయి. అల్ట్రా సిమెంట్, భారతీ ఎయిర్ టెల్, అంబుజా సిమెంట్, బీపీసీఎల్ తదితర కంపెనీలు రెండు శాతం వరకూ లాభపడగా, పీఎన్ బీ, హెచ్ డీఎఫ్ సీ, విప్రో, ఎస్ఎస్ఎల్ టీ, డీఎల్ఎఫ్ తదితర కంపెనీలు 3 నుంచి 5 శాతం వరకూ నష్టపోయాయి.