: లక్నోలో 'మోదీ మ్యాంగో' పేరుతో మామిడికాయలు!
ఉత్తరభారతంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాప్యులారిటీ అంతకంతకూ పెరిగిపోతోంది. ఇటీవల మోదీకి ఓ అభిమాని గుడి కట్టి పూజలు చేస్తుంటే, మరొకరు ఆయన పేరును మామిడిపండ్లకు పెట్టారు. లక్నోలోని మలీహాబాద్ శివార్లలో మామిడి పండ్లు పండించే హజీ కలిముల్లా తన తోటలో 'మోదీ మ్యాంగో' పేరుతో మామిడి మొక్కలు నాటాడు. వాటికి పండిన మొదటి పండ్లను ప్రధానమంత్రికి రుచిచూపించాలని అనుకుంటున్నాడు. "మొదటిగా పండిన మోదీ మ్యాంగో వెరైటీ పండ్లను కేవలం ప్రధానమంత్రి కోసమే ఉంచాను. కానీ వాటిని ఆయనకు పంపించేందుకు నాకెలాంటి అవకాశం లేదు" అని పలురకాల మామిడిపండ్లు పండించడంలో ప్రసిద్ధుడైన, పద్మశ్రీ పురస్కార గ్రహీత కలిముల్లా తెలిపాడు. ఆ పండ్లను ప్రధానికి పంపాలని తన కోరికని, తప్పకుండా ఆయనకు నచ్చుతాయని అనుకుంటున్నట్టు చెప్పాడు.