: యెమెన్ లో ఉంటున్న భారతీయుల్లారా తక్షణం బయల్దేరండి: భారత్
అరబ్బుల దేశం యెమెన్ నుంచి భారతీయులంతా తక్షణం వెనక్కి రావాలని భారతప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. యెమెన్ లో ఘర్షణ వాతావరణం పెరిగిపోవడంతో అక్కడున్న భారతీయులు ఘర్షణల్లో చిక్కుకుని ఇబ్బందులు పడకుండా, ప్రమాదాల బారిన పడకుండా తక్షణం స్వదేశానికి తిరిగి రావాలని భారత ప్రభుత్వం కోరింది. స్వదేశానికి చేరేందుకు అందుబాటులో ఎలాంటి రవాణా సౌకర్యం ఉన్నా దానిని వినియోగించుకుని తక్షణం స్వదేశానికి తరలి రావాలని విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి భారతీయులను కోరారు. యెమెన్ లో ఉన్న భారతీయుల్లో చాలామంది నర్సింగ్ వృత్తిలోనే ఉన్నారని, వారంతా పరిస్థితి తీవ్రతను గుర్తించి వెనక్కి రావాలని ఆయన పిలుపునిచ్చారు. 3 వేల మంది నుంచి 3,500 మంది వరకు భారతీయులు ఉంటారని ఆయన తెలిపారు. ఈ మేరకు సనాలో ఉన్న భారతీయ రాయబార కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. కాగా, యెమెన్ అధ్యక్షుడితో పాటు, అక్కడి ప్రభుత్వ నేతలపై షియా మిలీషియా వర్గాలు దాడులకు తెగబడుతున్న విషయం తెలిసిందే.