: నరేంద్ర గారూ, మాకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు: మండిపడ్డ జ్యోతుల నెహ్రూ
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎప్పట్లానే వాడీవేడిగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వ విప్ ధూళిపాళ్ల నరేంద్ర మాట్లాడుతూ, సమావేశాలు సజావుగా సాగకుండా ప్రతిపక్షం అడుగడుగునా అడ్డుపడుతోందని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై వైకాపా శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్షం చేస్తున్న అభ్యర్థనలను ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్లే సభ నుంచి తాము వాకౌట్ చేశామని... నరేంద్ర గారు తమకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదని అన్నారు. సమావేశాలు ఏకపక్షంగా కొనసాగుతున్నాయని, సమస్యలను లేవనెత్తితే తమపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని నెహ్రూ ఆవేదన వ్యక్తం చేశారు.