: కొత్త కంపెనీపై రతన్ టాటా ప్రేమ... భారీ పెట్టుబడి!
రెండేళ్ల నాడు ప్రారంభమైన ఒక సంస్థ భవిష్యత్తులో అద్భుత రీతిలో రాణించగలదని టాటా సన్స్ గౌరవ చైర్మన్ రతన్ టాటా భావించారు. ఆ సంస్థలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువచ్చారు. ఆన్ లైన్ మాధ్యమంగా గృహోపకరణాలను విక్రయించే ఈ-కామర్స్ సంస్థ 'అర్బన్ లాడర్'లో ఇన్వెస్ట్ చేశారు. స్వతహాగా ఆర్కిటెక్ట్ అయిన రతన్ టాటా ఫర్నిచర్ రంగం భవిష్యత్ పై నమ్మకంతో ఈ పెట్టుబడులు పెట్టినట్టు అర్బన్ లాడర్ సహ వ్యవస్థాపకుడు రాజీవ్ శ్రీవత్స తెలిపారు. అయితే ఎంత మొత్తాన్ని ఆయన ఇన్వెస్ట్ చేశారన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. 2012లో ప్రారంభమైన అర్బన్ లాడర్ ప్రస్తుతం 25 కేటగిరీల్లో 1000కి పైగా ఉత్పత్తులను ఆఫర్ చేస్తోంది. వార్డ్ రోబ్స్, పరుపులు, మంచాలు, సోఫాలు, డైనింగ్ టేబుళ్లు, కాఫీ టేబుళ్లు తదితరాలను ఆన్ లైన్లో విక్రయిస్తోంది. ప్రస్తుతం 8 నగరాల్లో తాము సేవలందిస్తున్నామని, త్వరలో ఈ సంఖ్యను 30కి పెంచుతామని తెలిపారు. కాగా, గత కొంతకాలంగా రతన్ టాటా ఈ-కామర్స్ కంపెనీల్లో తన సొంత నిధులను పెట్టుబడులుగా పెడుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఇప్పటికే స్నాప్ డీల్, పేటీఎం కంపెనీల్లో పెట్టుబడి పెట్టారు.