: ఏపీ అసెంబ్లీ సమావేశం ప్రారంభం... వైసీపీ వాయిదా తీర్మానం తిరస్కరణ
ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొద్దిసేపటి క్రితం ప్రారంభమయ్యాయి. రోజు మాదిరే ప్రతిపక్షం ప్రతిపాదించిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్ తిరస్కరించారు. నవ్యాంధ్ర రాజధాని కోసం భూసేకరణ, రాజధాని నిర్మాణంపై చర్చకు అనుమతించాలని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు. దీనిని తిరస్కరించిన కోడెల, ఈ విషయంపై సభలో ఇప్పటికే చర్చ పూర్తైందని తెలిపారు. అంతేకాక సభ సమావేశాలు మూడు రోజుల్లో ముగియనున్న తరుణంలో సభ సజావుగా సాగేందుకు సహకరించాలని ఆయన కోరారు. స్పీకర్ వినతిని తోసిపుచ్చిన వైసీపీ సభ్యులు, చర్చ కోసం పట్టుబట్టారు. ఈ సందర్భంగా వారు నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.