: రాహుల్! ఎక్కడున్నా వెంటనే వచ్చేయ్... అమ్మ బెంగ పెట్టుకుంది: యూపీలో పోస్టర్ల కలకలం!


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆచూకీ కోసం ఆ పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు బెంగ పెట్టుకున్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలకు ముందు నాలుగు వారాల పాటు సెలవు తీసుకుని మరీ వెళ్లిన రాహుల్, సెలవు గడువు ముగిసినా పత్తా లేరు. సెలవు ముగిసిన తర్వాత దానిని మరో రెండు వారాలకు ఆయన పొడిగించుకున్నారని పార్టీ వర్గాలు గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎంతకీ రాహుల్ తిరిగిరాకపోవడంతో ఆ పార్టీలో ఆందోళన నెలకొంది. తాజాగా నిన్న ఉత్తరప్రదేశ్ లోని అలహాబాదు, బులంద్ షహర్ తదితర ప్రాంతాల్లో రాహుల్ కనపడటం లేదని పోస్టర్లు వెలిశాయి. ‘‘రాహుల్... ఎక్కడున్నా వెంటనే వచ్చేయ్. అమ్మ సోనియా గాంధీ బెంగ పెట్టుకున్నారు’’ అంటూ సదరు పోస్టర్లలో గుర్తు తెలియని వ్యక్తులు పేర్కొన్నారు. ఈ పోస్టర్లపై కాంగ్రెస్ పార్టీ నేతలు భగ్గుమన్నారు. బీజేపీ నేతలే ఈ పోస్టర్లకు కారణమై ఉంటారని వారు ఆరోపించారు. మరోవైపు పోస్టర్లపై ఇప్పటిదాకా తమకెలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పిన యూపీ పోలీసులు... ఫిర్యాదు అందితే, దర్యాప్తు జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

  • Loading...

More Telugu News