: భీకర వైమానిక దాడుల్లో పాకిస్థాన్ తాలిబన్ చీఫ్ హతం?
తెహ్రీక్-ఏ-తాలిబన్ సంస్థ చీఫ్ ముల్లా ఫజులుల్లా (40) పాకిస్థాన్ లో జరిగిన వైమానిక దాడుల్లో హతమైనట్టు సమాచారం. పెషావర్ సైనిక పాఠశాలలో విద్యార్థులను ఊచకోత కోసిన ఘటనలో ఫజులుల్లానే సూత్రధారి. ఖైబర్ గిరిజన ప్రాంతంలో నిర్వహించిన భీకర వైమానిక దాడుల్లో అతడు ప్రాణాలు విడిచినట్టు తెలుస్తోంది. హకీముల్లా మసూద్ మరణించడంతో ఫజులుల్లా 2013లో పాక్ తాలిబన్ పగ్గాలు అందుకున్నాడు. కాగా, ఈ వారాంతంలో తాము ఖైబర్ గిరిజన ప్రాంతంలో జరిపిన దాడుల్లో కనీసం 80 మంది మిలిటెంట్లు చనిపోయి ఉంటారని, 100 మందికి పైగా గాయపడి ఉంటారని పాక్ సైన్యం తెలిపింది. ఫజులుల్లా కూడా దాడుల్లో చనిపోయి ఉండొచ్చని భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. ఈ విషయం నిర్ధారణ కావాల్సి ఉంది. ఖైబర్-పఖ్తుంక్వా గవర్నర్ మెహ్తాబ్ ఖాన్ మాట్లాడుతూ, ఫజులుల్లా మరణం రానున్న రోజుల్లో నిర్ధారణ అవుతుందని తెలిపారు. అయితే, తాలిబన్ ప్రతినిధి మహ్మద్ ఖొరసాని మాత్రం ఫజులుల్లా మరణించాడనడాన్ని ఖండించారు. ఇవన్నీ నిరాధారమైన వార్తలని ఖొరసాని కొట్టిపారేశారు.