: ఇద్దరు యువకులను కబళించిన భీముని గుండం
ఖమ్మం జిల్లా బయ్యారంలో పెద్ద చెరువు సమీపంలోని వాగులో ఉన్న భీముని గుండంలో ఇద్దరు యువకులు ప్రమాదవశాత్తు పడి ప్రాణాలు విడిచారు. హైదరాబాదుకు చెందిన హిమేశ్, నాగార్జున అనే యువకులు హైదరాబాద్ నుంచి ఇల్లెందుకు వెళుతూ మార్గమధ్యంలో ముకుందాపురం వద్ద కల్లు తాగారు. వారితో మరో నలుగురు మిత్రులు కూడా ఉన్నారు. కల్లు తాగిన తర్వాత వారు వాగులో ఈతకొట్టేందుకు దిగారు. అయితే, భీముని గుండంలో లోతు ఎక్కువగా ఉండడంతో హిమేష్, నాగార్జున నీట మునిగి మృతి చెందారు. హిమేశ్ స్వస్థలం ప్రకాశం జిల్లా కాగా, నాగార్జున తెనాలికి చెందిన యువకుడు. ఇంజినీరింగ్ పూర్తయిన వీరు హైదరాబాదులో ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. కాగా, స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.