: మెగా అభిమానుల ఆగ్రహం చవిచూసిన నాగేంద్రబాబు


మెగా బ్రదర్స్ మధ్య విభేదాల విషయం ఫ్యాన్స్ వరకు వెళ్లింది. హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో చిరంజీవి అభిమాన సంఘం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మెగా బ్రదర్ నాగేంద్రబాబు అభిమానుల ఆగ్రహాన్ని చవిచూశారు. ఇటీవల ఓ సినిమా ఫంక్షన్లో దాసరి నారాయణరావు చేసిన వ్యాఖ్యల పట్ల మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ స్పందించలేదని, ఆ వ్యాఖ్యలను ఎవరూ ఖండించలేదని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విభేదాలను పక్కనబెట్టి మెగా హీరోలందరూ ఐకమత్యంగా ఉండాలని అభిమానులు నాగబాబుకు స్పష్టం చేశారు. కలసికట్టుగా లేకపోతే ఆ ప్రభావం సినిమాల వసూళ్లపై పడుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేగాకుండా, చిరంజీవి యువత ఆధ్వర్యంలోనే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కూడా పనిచేసేలా చూడాలని వారు నాగబాబుకు సూచించారు. అభిమానుల ఆగ్రహావేశాలను ఓపిగ్గా భరించిన ఆయన, త్వరలోనే చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ లను ఒకే వేదికపైకి తెస్తానని హామీ ఇచ్చారు. కాగా, ఈ సమావేశంలో, ఏపీ, తెలంగాణలకు ప్రత్యేకంగా చిరంజీవి అభిమాన సంఘం కొత్త కమిటీలను ప్రకటించారు. ఏపీకి స్వామినాయుడు స్థానంలో ప్రసాద్ రెడ్డి, తెలంగాణకు కరాటే ప్రభాకర్ అధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించారు. స్వామినాయుడిని అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడిగా నియమించారు. ఈ కమిటీలకు నాగబాబు దిశానిర్దేశం చేశారు.

  • Loading...

More Telugu News