: యాంటీ టెర్రరిస్టు ఆపరేషన్ల లైవ్ కవరేజీ వద్దు... చానళ్లకు కేంద్రం సూచన
ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లను ప్రత్యక్ష ప్రసారం చేయరాదని టీవీ చానళ్లకు కేంద్రం స్పష్టం చేసింది. సాయుధ బలగాలు టెర్రరిస్టులను మట్టుబెట్టే క్రమంలో లైవ్ కవరేజీ ఇస్తే, అది ఆపరేషన్ కు విఘాతం కలిగించే ప్రమాదం ఉందని కేంద్రం భావిస్తోంది. మార్చి 20న జమ్మూకాశ్మీర్లోని కథువా జిల్లాలో టెర్రరిస్టులతో జరిగిన పోరును కొన్ని చానళ్లు లైవ్ గా టెలికాస్ట్ చేశాయి. ఈ నేపథ్యంలోనే, కేంద్ర సమాచార, ప్రసార శాఖ తాజా నిర్ణయం తీసుకుంది. దాడి జరుగుతున్న ప్రదేశం, బలాబలాలు, కదలికలు, వ్యూహాలు తదితర అంశాలను ప్రత్యేకంగా చూపొద్దని సదరు శాఖ పేర్కొంది. నిర్దిష్ట అధికారులే టెర్రర్ ఆపరేషన్ పూర్తయిన తర్వాత వివరాలు వెల్లడిస్తారని స్పష్టం చేసింది. దీనిపై సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి బిమల్ జుల్కా మాట్లాడుతూ, సమస్య సున్నితత్వం దృష్ట్యా ప్రసారకర్తల సహకారం కోరుతున్నామని తెలిపారు.