: చార్మినార్ ఎక్స్ ప్రెస్ లో దోపిడీ దొంగల బీభత్సం... మహిళల బంగారం అపహరణ
హైదరబాదు-చెన్నైల మధ్య రాకపోకలు సాగిస్తున్న చార్మినార్ ఎక్స్ ప్రెస్ లో గడచిన రాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. చెన్నై నుంచి హైదరాబాదు బయలుదేరిన రైలు ప్రకాశం జిల్లా రాపర్ల వద్దకు చేరుకోగానే గుర్తు తెలియని వ్యక్తులు చైన్ లాగి రైలును ఆపేశారు. దీంతో రైల్లోకి చొరబడ్డ ఎనిమిది మంది దొంగలు ఆరు బోగీల్లో స్వైర విహారం చేశారు. బోగీల్లోని మహిళల బంగారంతో పాటు వారి వద్ద ఉన్న నగదును కూడా దోచుకున్నారు. ఈ సమయంలో రైల్లో పోలీసులు లేరని తెలుస్తోంది. ఆ తర్వాత విజయవాడ చేరుకున్న తర్వాత బాధితులు రైల్వే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నేటి ఉదయం సికింద్రాబాదు చేరుకున్న మరికొంత మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు నేపథ్యంలో రైల్వే పోలీసులు ఘటనా స్థలాన్ని నేటి ఉదయం పరిశీలించారు.