: కోర్టు బోనులో నితిన్ గడ్కరీ... రెండున్నర గంటల పాటు ‘కేజ్రీ’ లాయర్ ప్రశ్నల వర్షం!


ఎరక్కపోయి ఇరుక్కుపోవడమంటే ఇదేనేమో! కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ విషయంలో ఈ సామెత అచ్చు గుద్దినట్లు సరిపోతుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను ఇరుకున పెడదామని కోర్టుకెళ్లిన గడ్కరీ, తానే ఇరుకుల్లో పడ్డారు. వివరాల్లోకెళితే, తనపై ఆరోపణలు గుప్పించిన కేజ్రీవాల్ పై నితిన్ గడ్కరీ ఢిల్లీ మెట్రోపాలిటన్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు విచారణకు సంబంధించి కేజ్రీవాల్ కు వ్యక్తిగత హాజరు నుంచి కోర్టు మినహాయింపునిచ్చింది. దీంతో కంగుతిన్న గడ్కరీ, కోర్టు ఆదేశాల మేరకు నేడు జరిగిన విచారణకు తప్పనిసరిగా హాజరు కావాల్సి వచ్చింది. గడ్కరీని బోనులో నిలబెట్టిన కేజ్రీవాల్ తరఫు న్యాయవాది దాదాపు రెండున్నర గంటల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు. కేంద్ర మంత్రిపై కేజ్రీవాల్ న్యాయవాది ప్రశ్నల పరంపరతో గడ్కరీ తరఫు న్యాయవాది అభ్యంతరం చెప్పారు. కేసుకు సంబంధం లేని ప్రశ్నలతో సతాయిస్తున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో ఇరువురు లాయర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా, న్యాయమూర్తి గోమతి మనోచా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘‘వాదులాటకు దిగాలనుకుంటే, బయటికెళ్లండి’’ అంటూ మొట్టికాయలేశారు.

  • Loading...

More Telugu News