: ఐఏఎస్ అధికారి రవి ఆత్మహత్య కేసులో ప్రేమ కోణం!
కర్ణాటకలో ఐఏఎస్ అధికారి డీకే రవి ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా, అతన్ని ఎవరైనా చంపారా? అన్న ప్రశ్నలకు సమాధానం లభించని నేపథ్యంలో, ఒక కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని భావిస్తున్న రోజే ఓ మహిళా ఐఏఎస్ ఆఫీసర్ కు 44 సార్లు ఫోన్ చేసినట్లు విచారణ అధికారులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆమెను కూడా ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. మరణించడానికి ముందు రవి ఆమెకు కొన్ని మెసేజ్ లను పంపినట్లు సమాచారం. ప్రస్తుతం దక్షిణ కర్ణాటకలో పనిచేస్తున్న ఆ అధికారిణి రవికి 2009 సంవత్సరంలో బ్యాచ్ మేట్ అని, వివాహిత అని, ఆమెకు ఓ పాప కూడా ఉందని తెలుస్తోంది. కాంగ్రెస్‌కు చెందిన రాజకీయ నాయకుడు హనుమంతరాయప్ప కుమార్తె కుసుమను వివాహం చేసుకోక ముందు ఐఏఎస్ అధికారిణి, రవి మంచి స్నేహితులని తెలుస్తోంది. ఆమెను ఉద్దేశించి రవి తన ఫేస్ బుక్ పేజీలో పోస్టులు కూడా పెట్టినట్టు ఓ ఆంగ్ల దిన పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. వీరిద్దరి మధ్యా ఉన్న బంధమేమైనా రవిని ఆత్మహత్యకు ప్రేరేపించిందా? అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది.