: ఖాతాదారులపై పెను భారం... సర్వీస్ చార్జీలు, జరిమానాలు పెంచనున్న ప్రైవేట్ బ్యాంకులు!
ప్రైవేట్ బ్యాంకుల్లో ఖాతాలు నిర్వహిస్తున్న వారి జేబుకు మరింత చిల్లు పడనుంది. ఐసీఐసీఐ, హెచ్ డీఎఫ్ సీ, యాక్సిస్, కోటక్ మహీంద్రా బ్యాంకు తదితరాలు సర్వీస్ చార్జీలు, జరిమానాలను పెంచాలని నిర్ణయించాయి. దేశంలోని అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుగా గుర్తింపున్న ఐసీఐసీఐ, ఖాతాలో కనీస బ్యాలెన్స్ నిర్వహించకపోతే పట్టణ ప్రాంతాల్లో రూ. 100, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 50 ఫైన్ గా వేయాలని నిర్ణయించింది. ఐసీఐసీఐ ఖాతాలో పట్టణ ప్రాంతంలో రూ. 10 వేలు, గ్రామీణ ప్రాంతంలో రూ. 5 వేలు మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాలి. ఖాతాను ఓపెన్ చేసిన శాఖలో కాకుండా మరో శాఖలో డబ్బు జమ చేస్తే, రూ. 1000కి రూ. 5 వసూలు చేయనుంది. ఒక వేళ మెషిన్ ద్వారా డబ్బు జమచేస్తే నెలలో ఒకసారి మాత్రమే ఉచితం. తదుపరి, రెండో లావాదేవీ నుంచి రూ. 5ను ఐసీఐసీఐ వసూలు చేస్తుంది. ఈ కొత్త నిర్ణయాలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తాయని ఐసీఐసీఐ బ్యాంకు తెలిపింది. ఖాతాలో కనీస మొత్తం లేకుంటే ఎస్ఎంఎస్ లేదా ఇ-మెయిల్ ద్వారా తెలుపుతామని, తరువాతి నెలలో కనీస మొత్తాన్ని జమచేయకుంటే జరిమానా విధిస్తామని వివరించింది. కాగా, మరో ప్రముఖ ప్రైవేటు బ్యాంకు హెచ్ డీఎఫ్ సీ 25 పేజీలున్న చెక్ బుక్ కోసం రూ. 75, ఖాతాలో కనీస మొత్తం లేకుంటే రూ. 150 నుంచి రూ. 600 వరకు వసూలు చేస్తామని తెలిపింది. ఇక యాక్సిస్ బ్యాంకు 'ప్రైమ్ ప్లస్' ఖాతాల్లో సర్వీస్ చార్జీలను పెంచుతున్నామని, కనీస బ్యాలెన్స్ (రూ. 10 వేలు) నిర్వహించకుంటే ప్రస్తుతం వసూలు చేస్తున్న రూ. 250 జరిమానాను తగ్గిన ప్రతి రూ. 100పై రూ. 5గా మార్చినట్టు తెలిపింది. ఈ జరిమానా గరిష్టంగా రూ. 350 మించబోదని స్పష్టం చేసింది. కోటక్ మహీంద్రా బ్యాంకు సైతం ఖాతాల నిర్వహణ సరిలేకుంటే విధించే జరిమానాను రూ. 250 నుంచి రూ. 300కు పెంచినట్టు తెలిపింది. సరాసరి బ్యాలెన్స్ సగం కన్నా తగ్గితే రూ. 400 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని, ఈ నిర్ణయాలు ఏప్రిల్ 1 నుంచి అమలవుతాయని పేర్కొంది.