: గూఢచర్యం కేసులో రిలయన్స్ వైస్ ప్రెసిడెంట్... కోర్టుకు తెలిపిన సీబీఐ
సంచలనం సృష్టించిన కార్పొరేట్ గూఢచర్యం కేసులో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ (ఫైనాన్స్) కే.వి.మోహనన్, ముంబై కేంద్రంగా న్యాయసేవలందిస్తున్న చితాలే అండ్ అసోసియేట్స్ ఎండీ రాజేంద్ర చితాలేలకు ప్రమేయముందని అనుమానిస్తున్నట్టు ఢిల్లీ కోర్టుకు సీబీఐ తెలిపింది. ఈ కేసులో అదుపులోకి తీసుకున్న ఇద్దరు నిందితులు ఖేంచంద్ గాంధీ, పరేష్ బుద్దదేవ్ ల కస్టడీని పొడిగించాలని సీబీఐ తరపు న్యాయవాది ప్రత్యేక కోర్టు జడ్జ్ ఎస్.సీ. రాజన్ ను కోరారు. ఈ సందర్భంగా తన వాదన వినిపిస్తూ, మోహనన్, చితాలేలకు ఈ కేసుతో సంబంధాలు ఉన్నట్టు పరేష్, గాంధీలను విచారించిన తరువాత తేలిందని కోర్టుకు తెలిపారు. ఈ కేసులో పత్రాల లీక్ కోసం పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందని వివరించారు. సీబీఐ వాదనతో ఏకీభవించిన కోర్టు కస్టడీని మరో రెండు రోజులు పొడిగించింది.