: స్పీకర్ ఫ్యాక్షనిస్టు... సీఎం రోగిష్టు: మీడియా పాయింట్ లో రోజా సంచలన వ్యాఖ్యలు
వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. సభలో గందరగోళం నేపథ్యంలో వైసీపీకి చెందిన ఎనిమిది మంది సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేసిన అనంతరం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ సభ్యులు వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బయటకు వచ్చిన రోజాను, ఏం జరిగిందంటూ మీడియా ప్రశ్నించింది. దీంతో ఆమె పరుష పదజాలం వినియోగించారు. స్పీకర్ స్థానంలో ఫ్యాక్షనిస్టు కొనసాగుతుంటే, సీఎం కుర్చీలో రోగిష్టు ఉన్నారని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని ఆమె ‘‘కుంటోళ్లు, గుడ్డోళ్లకు రాజ్యం అప్పగించొచ్చు కానీ, బొల్లి వ్యాధి ఉన్నోళ్లకు అప్పగించకూడదు’’ అని వ్యాఖ్యానించారు. దీంతో కంగుతిన్న మీడియా ప్రతినిధులు, సీఎంపై ఆ తరహా వ్యాఖ్యలు సరికాదని వారించగా, వారిపైనా ఆమె విరుచుకుపడ్డారు. ‘‘ఎల్లో జర్నలిజం చెయ్యొద్దు. నా మేకప్ పై టీడీపీ వాళ్లు వ్యాఖ్యానించడం లేదా?’’ అని అమె ప్రశ్నించడంతో మీడియా ప్రతినిధుల నోట మాట రాలేదు.