: బౌలర్లు ఇలాగే ఆడితే భారత్ టైటిల్ సాధించడం పెద్ద కష్టం కాదు: గిల్ క్రిస్ట్
బౌలర్లు ఇలాంటి ప్రదర్శన చివరి వరకు చేస్తే టీమిండియా టైటిల్ సాధించడం పెద్ద కష్టమేమీ కాదని ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. టీమిండియా విజయం సాధించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, రోహిత్ శర్మ మ్యాచ్ ను శాసించే సెంచరీ చేయడం శుభపరిణామమని అన్నాడు. పది నుంచి 30 ఓవర్ల మధ్య బంగ్లాదేశ్ బౌలర్లు కట్టడి చేసిన విధానం చూసి భారత్ తక్కువ స్కోరుకే పరిమితమవుతుందని భావించానని ఆయన చెప్పాడు. రైనా అండగా నిలవడంతో రోహిత్ టీమిండియా స్కోరు పెంచే భారం తనపై వేసుకున్నాడని ఆయన అన్నాడు. రోహిత్ ను 2007లో తొలిసారి చూశానని, అప్పుడే అతను భవిష్యత్ తారగా ఎదుగుతాడని భావించానని ఆయన గుర్తు చేసుకున్నాడు. భారత బౌలర్లు అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారని ఆయన పేర్కొన్నాడు. వారి ప్రదర్శన ఇలాగే కొనసాగితే టైటిల్ టీమిండియా ఖాతాలో చేరడం కష్టం కాదని ఆయన స్పష్టం చేశాడు.