: కోహ్లీని ఔట్ చేయగానే రూబెల్ అంతెత్తున ఎందుకెగిరాడో తెలుసా...?
నిన్నటి వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ లో టీమిండియా వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీని ఔట్ చేసిన బంగ్లా బౌలర్ రూబెల్ హసన్ ఎగిరి గంతేశాడు. కోహ్లీని ఔట్ చేసిన ఏ బౌలర్ అయినా, ఆ మేర ఎగిరి గంతేయడం మామూలే. అయితే రూబెల్ కాస్త ఎక్కువగా ఎగిరాడు. దీనికి ఓ కారణముందట. అది కూడా ఎప్పుడో 2008లో జరిగిన అండర్-19 వరల్డ్ కప్ లో చోటుచేసుకున్న ఘటన, నిన్నటి రూబెల్ గెంతులాటకు నాందీ పలికిందట. నాటి అండర్-19 వరల్డ్ కప్ నుంచి కోహ్లీ, రూబెల్ ల మధ్య వైరం కొనసాగుతూనే ఉంది. నాడు భారత్ కు కోహ్లీ సారధ్యం వహించగా, బంగ్లా జట్టుకు రూబెల్ కెప్టెన్ గా ఉన్నాడు. నాడు ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ఇరువురి మధ్య మాటల యుద్ధం జరిగిందట. ఆ తర్వాత 2011 వరల్డ్ కప్ టోర్నీ సందర్భంగా కోహ్లీ, రూబెల్ పై నోరు పారేసుకున్నాడు. అందుకు ప్రతిగా నిరుడు జరిగిన ఆసియా కప్ లో రూబెల్, కోహ్లీపై పగ తీర్చుకున్నాడు. తాజాగా నిన్నటి మ్యాచ్ లో కోహ్లీ ఔట్ కాగానే, రూబెల్ అంతెత్తున ఎగిరి గంతేశాడు.