: పాకిస్థానీ టీమిండియాను గెలిపించాడట... బంగ్లా అభిమానుల ఆవేదన


క్రికెట్ లో భారత్, పాకిస్థాన్ లు చిరకాల ప్రత్యర్ధులు. ఈ విషయం ఈ రెండు దేశాల వారికే కాక ప్రపంచంలోని అన్ని దేశాల క్రికెట్ అభిమానులకు తెలిసిన విషయమే. మరి టీమిండియాను పాకిస్థానీ గెలిపించడమేంటి? అదే విషయాన్ని అడిగితే, బంగ్లా క్రికెట్ అభిమానులు మాత్రం ఇది ముమ్మాటికీ నిజమని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. అంతేకాక వరల్డ్ కప్ నుంచి తమ జట్టు నిష్క్రమణకూ ఆ పాకిస్థానీ అసంబద్ధ నిర్ణయమే కారణమని వారు వాపోతున్నారు. నిన్న ఎంసీజీలో జరిగిన మ్యాచ్ కు పాక్ జాతీయుడు అలీమ్ దార్ ఓ అంపైర్ గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. భారత స్టైలిష్ బ్యాట్స్ మన్, నిన్నటి మ్యాచ్ హీరో రోహిత్ శర్మ ఔటైన బంతిని అలీమ్ దార్ నోబాల్ గా ప్రకటించారు. దీంతో లైఫ్ లభించిన రోహిత్, ఆ తర్వాత సెంచరీతో అదరగొట్టడమే కాక జట్టు స్కోరు 300 దాటడానికి పునాది వేశాడు. రోహిత్ కచ్చితంగా ఔటేనని చెబుతున్న బంగ్లా ఫ్యాన్స్, అలీమ్ దార్ అసంబద్ధ నిర్ణయమే తమ జట్టును పరాజయం బాట పట్టించిందని తేల్చేశారు. దీంతో అలీమ్ దార్ పై బంగ్లా అభిమానులు ఆవేదనతో పాటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అలీమ్ దార్ దిష్టిబొమ్మను బంగ్లా అభిమానులు నిన్న ఢాకా వీధుల్లో కాల్చేశారు.

  • Loading...

More Telugu News