: స్పీకర్ పై అవిశ్వాసం దిశగా వైసీపీ... ఎథిక్స్ కమిటీని వేయాలంటున్న యనమల
ఏపీ అసెంబ్లీలో నిన్న, నేడు జరిగిన వరుస ఆందోళనలు, ఉద్రిక్తతలు సభా వ్యవహారాలపై పెను ప్రశ్నలను లేవనెత్తాయి. సభలో అధికార, విపక్ష సభ్యులు దూషణల పర్వానికి దిగడంపై రాష్ట్ర ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తుంటే... తర్వాత వ్యవహరించాల్సిన వ్యూహాలపై టీడీపీ, వైసీపీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. నేటి సభా సమావేశాల నుంచి వాకౌట్ చేసిన అనంతరం సస్పెండైన తన పార్టీ సభ్యులతో కలిసి గవర్నర్ ను కలిసిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, స్పీకర్ కోడెల శివప్రసాద్ పై అవిశ్వాస తీర్మానం పెట్టే దిశగా యోచిస్తున్నారు. అధికార పక్షానికి కొమ్ముకాస్తున్న స్పీకర్ తమనే నియంత్రించే విధంగా వ్యవహరిస్తున్నారని జగన్, కోడెలపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే, విపక్ష సభ్యులపై ఏ తరహా చర్యలు తీసుకోవాలన్న అంశంపై అధికార పక్షం మల్లగుల్లాలు పడుతోంది. సభలో స్పీకర్ ను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు గుప్పించడం సభా హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని చెప్పిన సభా వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు, సభలో సభ్యుల వ్యవహారాల సరళిపై నిఘా పెట్టేందుకు ఎథిక్స్ కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలని స్పీకర్ ను కోరారు. వైసీపీ వాకౌట్ తర్వాత సభలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.