: మీడియా పాయింట్ నుంచి వైసీపీ సభ్యుల తరలింపు... మార్షల్స్ ప్రవేశంతో ఉద్రిక్తత
ఏపీ అసెంబ్లీలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. సభ నుంచి విపక్ష వైసీపీకి చెందిన ఎనిమిది మంది సభ్యులను సస్పెండ్ చేసిన అధికార పక్షం, వారిని అసెంబ్లీ ఆవరణ నుంచి కూడా పంపించివేసేందుకు పూనుకుంది. ఈ క్రమంలో మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడుతున్న కొడాలి నాని, చెవిరెడ్డి, పిన్నెల్లి తదితరులను తరలించేందుకు మార్షల్స్ ను రంగంలోకి దించింది. మార్షల్స్ రంగప్రవేశంతో వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్షల్స్ ను వైసీపీ సభ్యులు తీవ్రంగా ప్రతిఘటించారు. అయినా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మార్షల్స్ సస్పెండైన సభ్యులను ఎత్తుకుని బయటకు తరలించారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.