: నన్నే బద్నాం చేస్తారా?... హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫైర్
తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘చేతనైతే పనిచేయండి... లేకపోతే వేరే వారితో చేయించుకుంటాను’’ అంటూ ఆయన వారి తీరుపై మండిపడ్డారు. అంతేకాక పనిచేయకుండా తననే బద్నాం చేసేందుకు యత్నిస్తారా? అంటూ ఆయన వారిపై ఒంటికాలిపై లేచారు. పేదల స్థలాల క్రమబద్ధీకరణపై అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారన్న ఆయన, ‘‘పోండి, పోయి పని చేసుకోండి’’ అంటూ గదమాయించారు. పేదల స్థలాల క్రమబద్ధీకరణపై నిన్న సచివాలయంలో జరిగిన సమీక్షలో భాగంగా కేసీఆర్ ఆగ్రహోదగ్రులయ్యారు. ‘‘ప్రతి చిన్న దానికి రిజెక్ట్ చేస్తారా? సేల్ డీడ్ లేదు, వాటర్ బిల్లు లేదు, కరెంట్ బిల్లు లేదు అని రిజెక్ట్ చేస్తారా? ఇలా చేసి నన్ను బద్నాం చేయాలనుకుంటున్నారా? లక్షల సంఖ్యలో పేదలకు పట్టాలిస్తున్నామని నేనంటే, మీరు వేలల్లో కూడా దరఖాస్తులకు ఆమోదం తెలపరా?’’ అని ఆయన అసహనం వ్యక్తం చేశారు. ‘‘మీకు చేతనైతే పనిచేయండి. లేదంటే, వేరేవాళ్ల చేత చేయించుకుంటాం’’ అని కూడా ఆయన నిష్టూరమాడారు. పేదల దరఖాస్తుల పట్ల కాస్త ఉదారంగా ఉండాలన్న ఆయన, అధికారుల తీరుపై కోపం పట్టలేక సమావేశం చివరలోనూ ‘‘పోండి, పోయి పని చేసుకోండి’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఆగ్రహావేశాలతో రెండు జిల్లాల కలెక్టర్లకు నోట మాట రాలేదు.