: నెల్లూరు జిల్లాలో చిరుత సంచారం... వణికిపోతున్న ప్రజలు
నెల్లూరు జిల్లాలోని సైదాపురం, ఉదయగిరి, గూడూరు మండలాల ప్రజలు నిత్యం భయాందోళనల్లో కాలం వెళ్లదీస్తున్నారు. చిరుత సంచారం ఆ మండలాల ప్రజలను కంటి మీద కునుకు వేయనీయడం లేదు. ఒంటరిగా బయటకు రానివ్వడం లేదు. ఇంటి నుంచి బయటకు రావాలంటే ఈ మండలాల ప్రజలు గుంపులు గుంపులుగానే రావాల్సి వస్తోంది. మొన్నటికి మొన్న ఉదయగిరి మండలంలోని ఉదయగిరి దుర్గం సమీపంలో మేకల మందపై దాడి చేసిన చిరుత పదికి పైగా మేకలను చంపేసింది. తాజాగా నిన్న సైదాపురం మండలం మొలకలపూండ్ల పరిసరాల్లోకి వచ్చిన చిరుత శివయ్య అనే వ్యక్తిపై దాడి చేసింది. సకాలంలో గ్రామస్థులు స్పందించడంతో అతనిని వదిలేసి, పారిపోయింది. చిరుత దాడిలో గాయపడ్డ శివయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాజా దాడితో ఉదయగిరి, సైదాపురం మండలాలతో పాటు గూడూరు మండల ప్రజలు కూడా భయాందోళనలకు గురయ్యారు. ప్రజల నుంచి వెల్లువెత్తుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆయా గ్రామాల్లో బోనులను ఏర్పాటు చేసిన అటవీ శాఖాధికారులు, ఆ తర్వాత ఆ గ్రామాల వైపు కన్నెత్తి చూడటం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.