: రోజాపై చర్యలు తీసుకోవాలని రెండుసార్లు ఫిర్యాదు చేశాం: కాల్వ శ్రీనివాసులు
రోజాపై చర్యలు తీసుకోవాలని శాసనసభ స్పీకర్ కు రెండుసార్లు ఫిర్యాదు చేశామని టీడీపీ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, శాసనసభ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిమీదా ఉందని సూచించారు. సభ్యసమాజం తల వంచుకునేలా రోజా మాట్లాడారని ఆయన చెప్పారు. వైఎస్సార్సీపీ నేతలు అసభ్యపదజాలం ఉపయోగిస్తూ, రాజకీయ పబ్బం గడుపుకునేందుకు చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. శాసనసభలో ప్రతి వ్యక్తికీ కొన్ని హక్కులు ఉంటాయని చెప్పిన ఆయన, వాటిని గుర్తించి నడుచుకోవాలని సూచించారు. వైఎస్సార్సీపీ సభ్యులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరతామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా శాసనసభలో వైఎస్సార్సీపీకి సంబంధించిన దృశ్యాలను ఆయన విడుదల చేశారు.