: జార్ఖండ్ లో రావణకాష్టం చల్లారడానికి 3,800 ఏళ్లు పడుతుందట!
జార్ఖండ్ లోని ఝరియా అనే గ్రామం కింద ఓ బొగ్గు గని ఉంది. ఈ గ్రామం కిందనున్న బొగ్గు గనిలో ఓపెన్ క్యాస్టింగ్ సరిగా చేయకపోవడం వల్ల కూలిపోయిందని ఆరోపణలు ఉన్నాయి. అలా కూలిన గనిలో 70 చోట్ల నిరంతరం మంటలు చెలరేగుతున్నాయని 1916లోనే అధికారులు గుర్తించారు. బొగ్గు గని ఎందుకు కూలిపోయింది? ఎందుకు మంటలు చెలరేగుతున్నాయి? మంటలు ఎలా ఆర్పాలి? అనే విషయాలపై స్పష్టతలేదు. ఆ గ్రామం కింద సుమారు 150 కోట్ల టన్నుల బొగ్గునిల్వలు ఉన్నాయని, అవి మండిపోయి చల్లారడానికి ఇంచుమించు 3,800 సంవత్సరాలు పట్టవచ్చని 'ఎర్త్' మేగజైన్ వెల్లడించింది. రావణకాష్టంలా రగులుతున్న మంటలతో గ్రామంలోని భూమిని చీల్చుకుని అప్పుడప్పుడు అగ్నికీలలు ఎగజిమ్ముతాయట. కొన్ని చోట్ల సల్ఫర్, కార్బన్, టాక్సిక్ వాయువులు వెలువడుతుంటాయి. వీటి కారణంగా కంటి జబ్బులతోపాటు, చర్మవ్యాధులు కూడా వస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. ఎన్నికలప్పుడు తప్ప నేతలెవ్వరూ తమవైపు కన్నెత్తి చూడరని ఆ గ్రామీణులు ఆరోపిస్తున్నారు.