: పాక్ సెమీస్ చేరితే అజ్మల్ ఆడే అవకాశం!
వరల్డ్ కప్ గ్రూప్ దశలో తొలి రెండు మ్యాచ్ లు ఓడినా, వరుసగా నాలుగు మ్యాచ్ లలో నెగ్గి పాకిస్థాన్ క్వార్టర్ ఫైనల్ చేరడం తెలిసిందే. అయితే, పొడగరి పేసర్ మహ్మద్ ఇర్ఫాన్ గాయం కారణంగా టోర్నీకి దూరం కావడంతో ఆ జట్టు కలవరపడుతోంది. అతని స్థానాన్ని ఇంకా భర్తీ చేయలేదు. శుక్రవారం జరిగే మ్యాచ్ లో పాక్ జట్టు ఆసీస్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి సెమీస్ చేరితే పాక్ జట్టులో స్పిన్నర్ సయీద్ అజ్మల్ ను చేర్చే అవకాశం ఉందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) చైర్మన్ షహర్యార్ ఖాన్ అన్నారు. "గాయపడ్డ ఇర్ఫాన్ స్థానంలో ఎవరినీ ఎంపిక చేయలేదు. క్వార్టర్ ఫైనల్ కు తక్కువ సమయం ఉండడంతో, ఎంపిక చేసిన ఆటగాడు ఆ సమయానికి ఆస్ట్రేలియా చేరుకోలేడు. సెమీస్ చేరితే మాత్రం ఇర్ఫాన్ స్థానాన్ని మరో ఆటగాడితో భర్తీ చేస్తాం. ఆ ఆటగాడు అజ్మల్ కావచ్చు" అని ఖాన్ పేర్కొన్నారు. అజ్మల్ బౌలింగ్ యాక్షన్ సరిగా లేదంటూ ఐసీసీ కొన్నాళ్ల కిందట అతడిపై సస్పెన్షన్ వేటు వేసింది. అనంతరం, అతడికి పరీక్షలు నిర్వహించి మార్చుకున్న బౌలింగ్ శైలి నిబంధనలకు లోబడి ఉందంటూ సర్టిఫికెట్ ఇచ్చింది.