: కుప్పకూలుతున్న శ్రీలంక ... స్కోరు 116/8
వరల్డ్ కప్ లో భాగంగా సిడ్నీలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలుతోంది. 81 పరుగుల వద్ద జయవర్ధనే రూపంలో నాలుగో వికెట్ కోల్పోయిన లంక జట్టు... మరో నాలుగు వికెట్లను వెంటవెంటనే కోల్పోయింది. మిడిల్ ఆర్డల్ లో కీలక ఇన్నింగ్స్ ఆడగల సత్తా ఉన్న మాథ్యూస్ 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద డుమిని బౌలింగ్ లో డు ప్లెసిస్ కి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పెరీరా పరుగులేమీ చేయకుండానే ఇమ్రాన్ తాహిర్ బౌలింగ్ లో రోసోకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన కులశేఖర కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసిన డుమిని బౌలింగ్ కీపర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాతి బంతికే తొలి మ్యాచ్ ఆడుతున్న కౌశాల్ ను డుమిని బలిగొన్నాడు. మరోవైపు సంగక్కర 34 (88 బంతులు) ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ప్రస్తుతం శ్రీలంక స్కోరు 34.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 116 పరుగులు.