: ‘కోత’ల వెతల్లో తెలంగాణ సీఎం కేసీఆర్... కరెంట్ పోవడంతో సెల్ ఫోన్ వెలుగులో సంతకాలు
కొత్త రాష్ట్రం తెలంగాణను సతమతం చేస్తున్న విద్యుత్ కోతలు ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ నూ తాకాయి. హైదరాబాదులోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో నిన్న రాత్రి పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా పాల్గొన్న ఈ సమావేశానికి టీఆర్ఎస్ఎల్పీ నేతగా సీఎం కేసీఆర్ అధ్యక్షత వహించారు. సమావేశంలో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం, పార్టీ అభ్యర్థుల విజయావకాశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశం దాదాపు ముగిసింది. సమావేశం ముగిసిందని భావించిన కేసీఆర్ కొన్ని పత్రాలపై సంతకాలు చేసేందుకు సిద్ధమయ్యారు. సరిగ్గా అప్పుడే ఉన్నట్టుండి కార్యాలయంలో కరెంట్ పోయింది. దీంతో కార్యాలయంలో చీకట్లు అలముకున్నాయి. అయితే సంతకం చేసేదెలా? ఓ పార్టీ నేత తన సెల్ ఫోన్ లోని టార్చిని ఆన్ చేయగా, ఆ గుడ్డి వెలుగులోనే కేసీఆర్ సంతకాలు పెట్టేశారు.