: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఎలా ఇస్తారు?: వీరప్పమొయిలీ ప్రశ్న
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎలా ఇస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత వీరప్ప మొయిలీ కేంద్రాన్ని ప్రశ్నించారు. పార్లమెంటులో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు విభజన సమయంలో చాలా ప్రయోజనాలకు హామీలిచ్చారని, వాటిని నెరవేరిస్తే చాలని అన్నారు. అంతేగానీ, విభజన చట్టంలో లేని ప్రత్యేక హోదా ఎలా ఇస్తారని ఆయన నిలదీశారు. దక్షిణ భారతదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు అంతర్జాతీయ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని తెలిపిన ఆయన, ప్రత్యేక హోదా ఇస్తే కంపెనీలన్నీ ఆ రాష్ట్రానికే వెళ్లిపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణానికి, ప్రాజెక్టుల నిర్మాణానికి సహాయం చేస్తే చాలని కేంద్రానికి సూచించిన ఆయన, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా దేశంలోని ఇతర రాష్ట్రాల సమతౌల్యతను దెబ్బతీస్తుందని తెలిపారు.