: మాకు ప్రపంచకప్ ను గెలుచుకోగల సత్తా ఉంది: మిస్బావుల్ హక్
పాకిస్థాన్ జట్టుకు ప్రపంచకప్ ను గెలుచుకోగల సత్తా ఉందని కెప్టెన్ మిస్బావుల్ హక్ చెప్పాడు. పాక్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఐర్లాండ్ తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్ విజయం జట్టులో స్పూర్తిని పెంచిందని అన్నాడు. తీవ్ర ఒత్తిడిలో అద్భుతంగా రాణించామని చెప్పాడు. ఆ మ్యాచ్ లో పాక్ 23 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించడం తెలిసిందే. క్రికెట్ లో ఏదైనా సాధ్యమేనని చెప్పిన మిస్బా, తమ బౌలర్లు ప్రత్యర్ధులకు షాకిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపాడు. టైటిల్ సాధించేందుకు అవసరమైన అన్ని వనరులు తమ వద్ద ఉన్నాయని మిస్బా పేర్కొన్నాడు. బౌలర్లు బాగా రాణిస్తున్నారని, బ్యాటింగ్ లో సత్తా చాటేందుకు టాపార్డర్ సిద్ధంగా ఉందని మిస్బా చెప్పాడు. గ్రూప్ దశలో తొలి రెండు మ్యాచ్ లలో ఓటమిపాలైనా, వరుసగా నాలుగు విజయాలు సాధించి పాక్ క్వార్టర్ ఫైనల్ చేరుకోవడం విశేషం.