: 'తలకు దెబ్బతగిలింది డాక్టర్ గారూ' అంటే స్టాప్లర్ తో పిన్నులు కొట్టాడు!
తలకు గాయం కావడంతో బాధ తగ్గాలని డాక్టరును సంప్రదిస్తే స్టాప్లర్ తో పిన్నులు (కుట్లకు బదులుగా) వేసి ఆ బాధను మరింత పెంచాడో డాక్టరు. వరంగల్ జిల్లా తొర్రూరు మండలంలోని చిట్యాల గ్రామానికి చెందిన ఆవుల భారతమ్మ తన భర్త కూరయ్యతో కలిసి ద్విచక్రవాహనంపై వెళుతుండగా ప్రమాదానికి గురై గాయపడింది. నుదుటిపై గాయం కావడంతో నేరుగా తొర్రూరులోని ఎంబీబీఎస్ వైద్యుడు స్వరూప్ కుమార్ వద్దకు వెళ్లింది. ఆమె గాయాన్ని పరిశీలించిన స్వరూప్ కుమార్ స్టాప్లర్ తో పిన్నులు కొట్టాడు. అక్కడే ఉన్న కూరయ్య "అదేంటి డాక్టర్ గారూ, కుట్లు వేయండి" అని అడుగగా, "ఏమీ కాదులే!" అని చెప్పి పంపేశారు. నొప్పి తగ్గకపోవడంతో ఆమె వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి వెళ్లింది. పిన్నుల కారణంగా ఇన్ఫెక్షన్ వచ్చిందని, గాయాన్ని పరిశీలించిన వైద్యులు తెలిపారు. అనంతరం చికిత్స ప్రారంభించారు. దీనిపై స్వరూప్ కుమార్ ను ప్రశ్నించగా, చాలా మందికి పిన్నులు వేసినా ఎవరికీ ఇన్ఫెక్షన్ రాలేదని చెప్పారు. దీంతో అంతా విస్తుపోయారు. ఎంబీబీఎస్ చదివారా? లేక, డిగ్రీ కొనుక్కున్నారా? అంటూ స్థానికులు మండిపడుతున్నారు.