: నకిలీ పోలీసు అవతారమెత్తిన బీజేపీ యువనేత, మహిళలపై లైంగిక వేధింపులు... అరెస్ట్
తిరుపతిలో నకిలీ పోలీసుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. తాజాగా బీజేపీ యువనేత తన అనుచరులతో కలసి నకిలీ పోలీసు అవతారం ఎత్తాడు. పోలీసులమంటూ బెదిరిస్తూ, వ్యభిచార గృహాలపై దాడులు చేశారు. వారి దగ్గర నుంచి డబ్బు గుంజారు. మహిళలను లైంగికంగా వేధించి కోరికలు తీర్చుకొని, నగలు, నగదు దోపిడీ చేశారు. బాధిత మహిళలు 100కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా, దీనిపై స్పందించిన అలిపిరి పోలీసులు వలపన్ని నకిలీ పోలీసులను పట్టుకున్నారు. వారిని చూడగానే అవాక్కవడం పోలీసులు వంతైంది. కారణం, పట్టుబడిన వారిలో రాష్ట్ర బీజేపీ యువనేత ఉండడమే! ఈ నకిలీ పోలీసు ముఠాకు అతనే సారథ్యం వహించినట్టు విచారణలో వెల్లడైంది. కాగా, ఆయన విడుదల కోసం పోలీసులపై భారీ స్థాయిలో ఒత్తిడి వస్తున్నట్టు సమాచారం. పోలీసులు మాత్రం కేసును విచారిస్తున్నట్టు తెలిపారు.