: రాహుల్ పై ప్రభుత్వం గూఢచర్యం చేసిందన్న కాంగ్రెస్... ఆ అవసరంలేదన్న జైట్లీ


కొన్ని రోజుల కిందట కాంగ్రెస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన ఢిల్లీ పోలీసులు ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యక్తిగత వివరాలపై ఆరా తీయడంపై ఆ పార్టీ మండిపడుతోంది. దాంతో ఈ విషయం పార్లమెంటును ఈరోజు కుదిపేసింది. రాహుల్ పై కేంద్రం గూఢచర్యం చేస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. రాహుల్ ఎస్పీజీ భద్రత ఉన్న వ్యక్తని, అలాంటప్పుడు అకస్మాత్తుగా ఢిల్లీ పోలీసులు వచ్చి ఆయన వ్యక్తిగత వివరాలను ఎలా అడుగుతారని కాంగ్రెస్ నేత గులాంనబీ అజాద్ రాజ్యసభలో ప్రశ్నించారు. అసలు ఆరా తీయాల్సిన అవసరం ఏమొచ్చిందని సూటిగా అడిగారు. ఇలా గూఢచర్యం చేస్తూ రాజకీయ పార్టీల్లో భయం పుట్టించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అజాద్ అన్నారు. దానిపై వెంటనే హోంమంత్రి ఓ ప్రకటన చేయాలని కోరుతున్నామన్నారు. ఇలా ఎంపీలపై గూఢచర్యమే కాకుండా వారి ఫోన్లను కూడా ట్యాపింగ్ చేస్తున్నారని ఇతర పార్టీల నేతలన్నారు. వెంటనే ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో జైట్లీ రాజ్యసభలో మాట్లాడుతూ, రాహుల్ వ్యక్తిగత వివరాలు సేకరించడం గూఢచర్యం కాదన్నారు. పుకార్లను వాస్తవంగా చిత్రించడం సరికాదన్నారు. 1987లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటి నుంచే రాజకీయ నేతల ప్రొఫైల్ గురించి రాస్తున్నారని చెప్పారు. అయితే గూఢచర్యం అనేది ఎవరికీ తెలియకుండా జరుగుతుందని, వారి గురించి అడిగి చేయరని పేర్కొన్నారు. 1999 నుంచి ఈ ఫ్రొఫైల్ విధానం మారిందని వివరించారు. ఇలా పలువురు ఎంపీల గురించిన వివరాలు రాశారన్నారు. యూపీఏ హయాంలో 526 ఫామ్స్ ఉన్నాయని, వాటన్నింటినీ చూపుతామని తెలిపారు. మంత్రి సమాధానానికి సంతృప్తి చెందని కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేసింది.

  • Loading...

More Telugu News