: ప్రభుత్వ సదస్సు పేరిట ఎన్నికల సభ... కోడ్ ఉల్లంఘించిన తెలంగాణ మంత్రి
గిరిజన ఉద్యోగ, ఉపాధ్యాయ సదస్సు వేదికను ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభగా టీఆర్ఎస్ పార్టీ మార్చేసింది. తెలంగాణ మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్వయంగా వేదికనెక్కి పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలని, తెలంగాణ ఉద్యోగులను తప్పక తెలంగాణ రాష్ట్రానికి రప్పిస్తామని అన్నారు. గిరిజనులకు వంద శాతం ప్రమోషన్లు కల్పిస్తామని, సీటీఆర్ లను రెగ్యులర్ చేస్తామని, నూతన విద్యా సంవత్సరం నుంచి ఓవర్ డ్రాఫ్ట్ అవకాశాలు అమలు చేస్తామని హామీల వర్షం కురిపించారు. భద్రాచలం ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరం ఇందుకు వేదికైంది. ఇక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని అధికార వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ సదస్సు సందర్భంగా, ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర రెడ్డి ఫొటోతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం విమర్శలకు తావిచ్చింది. సదస్సులో అధికార పార్టీ నాయకులు పాల్గొనడంపై రెవెన్యూ సిబ్బంది ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చినట్టు తెలిసింది.