: అవినాశ్ స్థానంలో సుబ్రహ్మణ్యం... బీజేపీ నేత ఫిర్యాదుతో అనుచరుల అరెస్ట్!
అదే బుగ్గ కారు, సూటు, బూటు... అంతర్జాతీయ మానవ హక్కుల సంఘం ఏపీ చైర్మన్ నేమ్ ప్లేట్ తో నయా మోసానికి దిగాడు మరో మాయగాడు. ఇప్పటికే ఐఎల్ఓ ఏపీ అధ్యక్షుడి పేరిట చెలామణి అవుతూ, తనను ఎదిరించిన వారి తాట తీసి, ఓ వీడియాతో అడ్డంగా బుక్కైన 420 అవినాశ్ తరహాలోనే మోసాలకు తెర తీశాడు. అవినాశ్ స్థానంలో తాను నియమితుడినయ్యానంటూ చెప్పుకుంటూ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పలువురు ప్రముఖులను బురిడీ కొట్టించేందుకు యత్నించాడు. అయితే, అతడి వేధింపులు భరించలేని బెజవాడకు చెందిన బీజేపీ నేత గుర్నాథం రోజుల వ్యవధిలోనే పోలీసులను ఆశ్రయించాడు. నా పైనే ఫిర్యాదు చేస్తావా? అంటూ సుబ్రహ్మణ్యం, గుర్నాథంను బెదిరించసాగాడు. దీంతో మరోమారు అందిన గుర్నాథం ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. బాధితుడి నుంచి ఫోన్ చేయించి అతడి అనుచరులిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం తమ అదుపులోని సుబ్రహ్మణ్యం అనుచరులిద్దరినీ బెజవాడ పోలీసులు విచారిస్తున్నారు. ఎక్కడెక్కడ వసూళ్లు చేశారన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. త్వరలోనే సుబ్రహ్మణ్యంను అరెస్ట్ చేస్తామని పోలీసులు చెబుతున్నారు.