: టీడీపీ సభ్యులకు 3 ఏళ్ల జైలు శిక్ష విధించాల్సింది...జానా వ్యాఖ్యలు సరికాదు: హరీష్ రావు
జాతీయ గీతాన్ని అవమానించి, క్షమాపణలు చెప్పనందుకు టీడీపీ నేతలకు 3 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించాల్సిందని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. హైదరాబాదులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాము ఉదారంగా వ్యవహరించాం కనుకే శిక్షించకుండా టీడీపీ నేతలపై సస్పెన్షన్ విధించామని అన్నారు. అన్ని రాజకీయ పక్షాల ఆమోదంతోనే టీడీపీ నేతలను సస్పెండ్ చేశామని ఆయన చెప్పారు. వీడియో పుటేజ్ ను ఎడిట్ చేశారని జానారెడ్డి వ్యాఖ్యానించడం అసెంబ్లీ స్పీకర్ ను అవమానించడమేనని హరీష్ రావు వ్యాఖ్యానించారు. టీడీపీ నేతలపై సస్పెన్షన్ సరైందేనని ఆయన సమర్థించుకున్నారు.