: లాలూ కుమార్తె మీసాభారతి కేసులో రిట్ దాఖలు
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో కీలక ప్రసంగం చేశానంటూ ఆర్ జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె మీసాభారతి సరదాగా సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోలు వివాదం సృష్టించిన సంగతి విదితమే. దాంతో ఆమె మోసానికి, నమ్మకద్రోహానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో కేసు కూడా నమోదైంది. తాజాగా, ఈ కేసులో బీహార్ బీజేపీ ఉపాధ్యక్షుడు చంద్ర ప్రకాష్ పరాశర్ ముజఫర్ పూర్ లోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ముందు రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఐపీసీ 323, 406, 420, 465, 468, 471 సెక్షన్ల కింద ఈ రిట్ దాఖలైంది. దానికి సంబంధించిన ఓ కాపీని కూడా చంద్ర ప్రకాష్ మీడియా ప్రతినిధులకు ఇచ్చారు. తన రిట్ పై కోర్టు జూన్ 5న విచారణ జరపనున్నట్టు తెలిపారు.