: కూతురు అదృశ్యంపై ఫిర్యాదు స్వీకరించని పోలీసులు... గుండె పగిలి చనిపోయిన తండ్రి
కూతురు కనిపించడం లేదు, వెతికిపెట్టండన్న ఆ తండ్రి నుంచి ఫిర్యాదు స్వీకరించేందుకు కఠినాత్ములైన ఖాకీలు నిరాకరించారు. దీంతో కూతురు జాడ కనుగొనేదెలా? అని ఆందోళనకు గురైన ఆ తండ్రి గుండెపోటుకు గురయ్యాడు. వెనువెంటనే మరణించాడు. హృదయవిదారకమైన ఈ ఘటన కడప జిల్లా పాతరాయచోటిలో నేటి ఉదయం చోటుచేసుకుంది. పాతరాయచోటికి చెందిన వెంకటరమణ కూతురు అదృశ్యమైంది. దీంతో గుప్పెడు దు:ఖంలో కూరుకుపోయిన వెంకటరమణ, తన కూతురు జాడ తెలియడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. అయితే నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులు ఆయన ఫిర్యాదును స్వీకరించేందుకు నిరాకరించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన వెంకటరమణ గుండెపోటుకు గురై మృత్యువాతపడ్డాడు.