: మాల్దీవుల మాజీ అధ్యక్షుడికి 13 ఏళ్ల జైలు... విచారం వ్యక్తం చేసిన భారత్
మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్ కు ఓ క్రిమినల్ కోర్టు 13 ఏళ్ల జైలు శిక్ష విధించడంతో భారత్ విచారం వ్యక్తం చేసింది. "మాల్దీవుల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై మేము ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. అక్కడ పరిస్థితిపై పర్యవేక్షిస్తున్నాం" అని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. మాల్దీవుల్లో తొలిసారి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన నషీద్ 2012లో ఓ జడ్జిని కిడ్నాప్ చేసినట్టు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. దాంతో అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో 1990 తీవ్రవాద వ్యతిరేక చట్టం కింద ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. దాంతో ఈ ఏడాది ఫిబ్రవరి 22న నషీద్ ను పోలీసులు అరెస్టు చేశారు. గత రాత్రి (శుక్రవారం) ఆలస్యంగా ఈ కేసు విచారణకు రాగా కోర్టు పదమూడేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు ప్రకటించింది.