: జింబాబ్వే కెప్టెన్ టేలర్ ఔట్... చివరి మ్యాచ్ లో సెంచరీతో చెలరేగాడు!
జింబాబ్వే కెప్టెన్ బ్రెండన్ టేలర్ ఇకపై మైదానంలో కనిపించడు. ఎందుకంటే, అతడు క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. వరల్డ్ కప్ లో భాగంగా నేటి ఉదయం భారత్ తో మొదలైన లీగ్ మ్యాచ్ అతడికి చివరిది. చివరి మ్యాచ్ లో సెంచరీతో చెలరేగిన టేలర్, జెంటిల్మన్ గేమ్ కు ఘనంగా వీడ్కోలు పలికాడు. నేటి మ్యాచ్ లో భాగంగా బౌండరీలతో చెలరేగిన అతడు 110 బంతుల్లో 125.45 స్ట్రయిక్ రేట్ లో 138 పరుగులు చేశాడు. ఇందులో 15 ఫోర్లు, ఐదు సిక్స్ లున్నాయి. వీర విహారంతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరును జతచేసిన టేలర్ కు జింబాబ్వే అభిమానులు ఘనంగా వీడ్కోలు పలికారు. టీమిండియా జట్టు సభ్యులు కూడా టేలర్ కు వీడ్కోలు చెప్పారు. ఇక టేలర్ రూపంలో జింబాబ్వే ఐదో వికెట్ ను కోల్పోయింది. మోహిత్ శర్మ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించిన టేలర్ ను శిఖర్ ధావన్ క్యాచ్ పట్టి ఔట్ చేశాడు. ఆ తర్వాత వెనువెంటనే జింబాబ్వే మరో వికెట్ ను కోల్పోయింది. 43.4 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి జింబాబ్వే 250 పరుగులు చేసింది.