: రజనీకాంత్ కు తలనొప్పి తెచ్చిపెట్టిన వియ్యంకుడు
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను వివాదాలు వీడడంలేదు. లింగా ఫ్లాప్ కావడంతో డిస్ట్రిబ్యూటర్లు తమకు నష్టపరిహారం చెల్లించేలా నిర్మాతలను ఒప్పించాలంటూ రజనీ వెంటపడిన సంగతి తెలిసిందే. అంతకుముందు, లింగా కథ తనదేనంటూ ఓ యువదర్శకుడు కోర్టులో ఫిర్యాదు చేయగా, సినిమా యూనిట్ కు నోటీసులు వెళ్లాయి. ఆ కష్టాలను ఇంకా మరువక ముందే, రజనీకాంత్ కు చెన్నై హైకోర్టు నోటీసులు పంపింది. అల్లుడు ధనుష్ తండ్రి కస్తూరి రాజా ఈసారి రజనీకాంత్ కు తలనొప్పి తెచ్చిపెట్టాడు. ముకుల్ చంద్ అనే ఫైనాన్షియర్ వద్ద కస్తూరి రాజా రూ.65 లక్షలు తీసుకున్నాడు. అయితే, కస్తూరి రాజా ఆ రుణాన్ని తీర్చడంలో విఫలమయ్యాడు. దాని తాలూకు ఎఫెక్ట్ కాస్తా మధ్యలో షూరిటీగా ఉన్న రజనీకి తగిలింది. సదరు ఫైనాన్షియర్ కోర్టుకెళ్లిన నేపథ్యంలో, రజనీకి నోటీసులు వెళ్లాయి. దీనివెనుక అసలు కారణం మరొకటి ఉందని తమిళ సినీ పరిశ్రమ గుసగుసలాడుతోంది. ముకుల్ చంద్ మిత్రుడొకరు 'మై హూ రజనీకాంత్' పేరిట సినిమా నిర్మాణానికి పూనుకోగా, టైటిల్ లో తన పేరు ఎలా ఉపయోగించుకుంటారని రజనీ న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఇబ్బందుల పాల్జేశాడని, అందుకే ముకుల్ చంద్ ఇలా దెబ్బకొట్టాడని అంటున్నారు.