: ఏపీ నెంబర్ వన్ రాష్ట్రం అవుతుంది... రోడ్ మ్యాప్ వెల్లడించిన చంద్రబాబు
దేశంలోకెల్లా నెంబర్ వన్ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మలచాలన్నదే తమ ప్రభుత్వ ప్రయత్నమని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. విశాఖలో మౌలిక సదుపాయాల మిషన్ ను ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ... 2029 నాటికి ఏపీని దేశంలో ప్రథమస్థానంలో నిలిపేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నామని తెలిపారు. అందుకు అవసరమైన కార్యాచరణను సిద్ధం చేశామని చెప్పారు. ఆగ్నేయాసియాకు ముఖద్వారంలా ఏపీని తయారుచేస్తామని ధీమాగా చెప్పారు. 3 మెగాసిటీలు, 11 స్మార్ట్ సిటీలతో ఆర్థిక కేంద్రంగా ఏపీ రూపుదిద్దుకుంటుందని, 28 ప్రత్యేక ఆర్థిక మండళ్ల అభివృద్ధితో ఆర్థిక కేంద్రంగా విలసిల్లుతుందని వివరించారు. రాష్ట్రంలో 3 అంతర్జాతీయ, 10 దేశీయ విమానాశ్రయాలు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. దశల వారీగా 18 పోర్టుల నిర్మాణం చేపట్టనున్నట్టు చెప్పారు. భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటు చేస్తామని, భోగాపురంలోనే విమాన స్పేర్ పార్టుల పరిశ్రమ, ఏరోసిటీ నెలకొల్పుతామని చంద్రబాబు ఈ సందర్భంగా వివరించారు. నాగార్జున సాగర్, దొనకొండ, కుప్పం ప్రాంతాల్లో ఉన్న ఎయిర్ పోర్టులను మెరుగుపరుస్తామని చెప్పారు. దగదర్తి, ఓర్వకల్లు, ఒంగోలు, చిత్తూరు శ్రీసిటీ, తాడేపల్లిగూడెంలో విమానాశ్రయాలు నిర్మిస్తామన్నారు. మౌలిక సదుపాయాలను విస్తృత పరుస్తామని స్పష్టం చేశారు. మౌలిక మిషన్ లో భాగంగా రవాణా మార్గాలకు ప్రాధాన్యాతనిస్తామని వివరించారు. గంగవరంలో5 మిలియన్ టన్నుల సామర్థ్యంలో ఎల్ఎన్జీ టెర్మినల్, కాకినాడలో 10 మిలియన్ టన్నుల సామర్థ్యంతో సముద్రంలో తేలియాడే ఎల్ఎన్జీ టెర్మినల్ నిర్మిస్తామన్నారు. కాకినాడ-ఎన్నూరు జలరవాణా మార్గం అభివృద్ధికి కృషి చేస్తామని, తడ నుంచి ఇచ్ఛాపురం వరకు జాతీయ రహదారి నిర్మిస్తామని చెప్పారు. అన్ని ప్రధాన నగరాల్లో పైపులైన్ ద్వారా ఇళ్లకు గ్యాస్ సరఫరా చేస్తామని... కాకినాడ-శ్రీకాకుళం, విజయవాడ-నెల్లూరు మధ్య గ్యాస్ పైపులైన్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కాకినాడ డీప్ వాటర్ పోర్టు విస్తరణకు కాకినాడ సీ పోర్టు లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకున్నట్టు వివరించారు. శ్రీకాకుళం గ్యాస్ పైపు లైన్ ఏర్పాటుకు జీఎమ్మార్, జీవీకే, కోనసీమ పవర్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పారు. విశాఖలో అంతర్జాతీయ స్థాయి కన్వెన్షన్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. భవానీ ద్వీపం, కైలాసగిరి ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధికి పాటుపడతామన్నారు.