: జడ్పీ చైర్మన్ వేతనం నెలకు రూ.లక్ష... తెలంగాణలో భారీగా పెరిగిన ‘స్థానిక’ వేతనాలు
జిల్లా పరిషత్ చైర్ పర్సన్లు హోదాకే కేబినెట్ ర్యాంకు. వేతనం మాత్రం ఎమ్మెల్యేకు అందుతున్న దానిలో పైసా వంతు కూడా ఉండదు. ఇక సర్పంచ్ లుగా నెగ్గిన వారు సర్కారు పనిని వెట్టి చాకిరీ కింద చేసేయాల్సిందే. పంచాయతీలు, మునిసిపాలిటీలు, మండల, జిల్లా పరిషత్ పాలక వర్గాల సభ్యుల వేతనాలు దినసరి కూలీల కంటే తక్కువంటే అతిశయోక్తి కాదు. అయితే ఇదంతా నిన్నటి మాట. తెలంగాణలో ఇకపై జిల్లా పరిషత్ చైర్మన్లు కూడా ఎమ్మెల్యే అంత కాకున్నా, వారి వేతనంలో సగం మేర వేతనాన్ని అందుకోనున్నారు. అంటే, నెలకు అక్షరాలా రూ. లక్ష వేతనమన్న మాట. ఈ మేరకు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాలను పెంచుతూ తెలంగాణ సర్కారు కొద్దిసేపటి క్రితం నిర్ణయం తీసుకుంది. పెరిగిన వేతనాల ప్రకారం ఇప్పటిదాకా నెలకు రూ.7,500 తీసుకునే జడ్పీ చైర్ పర్సన్లు ఇకపై రూ. లక్ష తీసుకుంటారు. కార్పొరేషన్ మేయర్లు రూ. 50 వేలు (గతంలో రూ. 14 వేలు), డిప్యూటీ మేయర్లు రూ. 25 వేలు (గతంలో రూ.8 వేలు), సర్పంచ్, ఎంపీటీసీలు రూ.5 వేలు (గతంలో రూ.750), ఎంపీపీ రూ.10 వేలు (గతంలో రూ.1,500), జడ్పీటీసీ రూ.10 వేలు (గతంలో రూ.2,250) వేతనంగా అందుకోనున్నారు. మునిసిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు కూడా ఆయా మునిసిపాలిటీ గ్రేడ్లను బట్టి పెరిగిన వేతనాలే అందుకోనున్నారు.