: స్టీవ్ జాబ్స్ కు లివర్ ఇస్తానన్న టిమ్ కుక్, 'యాహూ'ను కొనుగోలు చేయాలనుకున్న జాబ్స్... తాజా ఆత్మకథలో కొత్త విషయాలు!
మనిషి చనిపోయాక కూడా గతంలో అతనికి సంబంధించిన కొన్ని విషయాలు కూడా ఆత్మకథల పేరుతో వచ్చే పుస్తకాల ద్వారా బయటపడతాయి. యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ కు సంబంధించిన కొన్ని విషయాలు తాజా ఆత్మకథలో వెల్లడయ్యాయి. 'బికమింగ్ స్టీవ్ జాబ్స్: ద ఎవల్యూషన్ ఆఫ్ ఏ రెక్ లెస్ అప్ స్టార్ట్ ఇన్ టు ఏ విజినరీ లీడర్' పేరుతో త్వరలో ఓ పుస్తకం విడుదల కానుంది. దాన్ని బ్రెంట్ ష్లెండర్, రిక్ టెట్జిలి రాశారు. జాబ్స్ గురించి ఇంతవరకు ఎవరికీ తెలియని కొన్ని విషయాలు ఈ ఆత్మకథలో వెల్లడయ్యాయి. ఇంకా విడుదలకాని ఈ పుస్తకం ఈ నెల 24నుంచి మార్కెట్ లో అమ్ముడవనుంది. అందులో కొన్ని సంచలన, ముఖ్య అంశాలను లూక్ డొర్ మెహల్ అనే రచయిత ప్రధానంగా పేర్కొన్నాడు. "జాబ్స్, టిమ్ కుక్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధానికి సంబంధించిన కొన్ని విషయాలను నేను చెబుతున్నా. జాబ్స్ యాహును కోనుగోలు చేయాలనుకున్న విషయాన్ని రివీల్ చేస్తున్నా! అంతకంటే మరిన్ని విషయాలు కూడా" అని లూక్ తెలిపాడు. ఇక రానున్న ఆత్మకథలో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, అప్పటికే బాగా ఆరోగ్యం దెబ్బతిన్న జాబ్స్ కు టిమ్ కుక్ తన లివర్ ను దానం చేయడానికి సిద్ధమయ్యాడట. ఎందుకంటే వారిద్దరి ఓకే బ్లడ్ గ్రూప్ కావడం. కానీ జాబ్స్ ఆ ప్రతిపాదనకు అంగీకరించలేదని పుస్తకంలో పేర్కొన్నారు.