: నో చేంజెస్... విన్నింగ్ టీం కంటిన్యూస్: ప్రయోగాలకు ససేమిరా అంటున్న కెప్టెన్ కూల్ ధోనీ
టీమిండియా జట్టు సారధి కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ... ప్రయోగాలకు సరికొత్త నిర్వచనం చెప్పిన ధీరుడు. అయితే ప్రస్తుత వరల్డ్ కప్ లో మాత్రం ప్రయోగాలకు చాన్సే లేదంటున్నాడు. ఎందుకంటే, 2011లో వరల్డ్ కప్ ను గెలుచుని రెండోసారి టైటిల్ వేటలో దూసుకెళుతున్న జట్టును ప్రయోగాల పేరిట ఇబ్బంది పెట్టదలచుకోలేదట. ఈ వరల్డ్ కప్ కూడా గెలిస్తే, ధోనీ రికార్డు సమీప భవిష్యత్తులో చెరిగిపోవడం దాదాపు అసాధ్యమే. ఇప్పటికే టీమిండియా సారధ్య బాధ్యతలు చేపట్టిన దిగ్గజాలను వెనక్కు నెట్టేసిన ధోనీ, విజయవంతమైన కెప్టెన్ గా అవతరించాడు. తాజా వరల్డ్ కప్ లో ఇప్పటికే నాకౌట్ దశకు జట్టు చేరిన దశలో, ప్రయోగాలేమైనా చేస్తారా? అన్న మీడియా ప్రశ్నలకు అతడు వేగంగా స్పందించాడు. ‘‘వరల్డ్ కప్ లో ముందున్న మ్యాచ్ లలో ఎలాంటి ప్రయోగాలు చేయం. విన్నింగ్ జట్టునే కొనసాగిస్తాం. విన్నింగ్ టీంలో ఎవరైనా ఆడలేని పరిస్థితి ఉంటేనే, అందుకనుగుణంగా స్వల్ప మార్పులు చేస్తాం’’ అంటూ విస్పష్ట ప్రకటన చేశాడు. అంటే, ఈ సారి కూడా వరల్డ్ కప్ టైటిల్ తనదేనన్న ధీమా అతడితో ప్రోది చేసుకున్నట్టేగా, బెస్టాఫ్ లక్ ధోనీ...!